నిజం – అబద్ధం


జీవితం ఓ ముళ్ళకంప. కానీ అందులో పూలు పూయించటం కోసం పుట్టేవు నువ్వు. తెలుసుకో నేస్తం!

అయ్యో! బాధపడతారేమో అని ఎప్పుడూ అబద్ధం చెప్పకు.. ఏదోక రోజు నిజం బట్టబయలైనపుడు ఆ అబద్ధమే పుండు మీద కారంగా మారుతుంది.  నీ నుదుటి మీద మచ్చగా నిలిచిపోతుంది.

ఈ మధ్య లేటుగా, ఘాటుగా తెలుసుకున్న నిజం ఇది.  ఎంతోమంది వస్తారు, వెళ్ళిపోతారు కానీ ఒక మంచి స్నేహితుణ్ణి లేదా స్నేహితురాలిని కోల్పోవటం ఎప్పటికీ బాధించే విషయం. అదీ ఒక చిన్న సంఘటనతో,  ఒక సిల్లీ అబద్ధంతో.

ఎవడి బ్రతుకు వాడిదే! ఒకడికొకడు చేసేదేంలేదు.  ఊపిరి బిగించి రెక్కల బలం కొద్దీ ఎగురుతున్నప్పుడు పక్కనున్నవాణ్ణి పట్టించుకోవటం కొంచెం కష్టమే.  నేనలాంటివేవీ ఆశించను. ఏవీ ఆశించను కాబట్టి ఎవ్వరికీ అర్ధం కాను. హహ్! అక్కడే వచ్చింది చికాకు.  అర్ధం కాను కాబట్టి ఎవడిష్టమొచ్చినట్టు వాడు అర్ధం చేసుకుంటాడు నన్ను. అప్పుడు కూడా నేనేమీ అనుకోను.  తెలుసుకుంటార్లే.. తోలింకా లేత కదా అని ఊర్కుంటాను.  ఏదో సామెత చెప్పినట్టు, ఎప్పటికైనా తెగిపోయేదైతే ఇప్పుడే తెగిపోవటం మంచిదట. మర్ఫీ అనే అతను ఇంగ్లీషు లోకి కూడా అనువదించాడీ సామెతని ఇంకో రకంగా. సర్లెండి కానీ చివరాఖరికి వీడెవడో తోలు మందంగాడనుకోకండి.  నేనూ మనిషినే.  నిజంగానే.  నా ఎగుడు దిగుళ్ళు నాకున్నై.  నా దెబ్బలు నాకు తగిలినయ్. కాకపోతే తాతతండ్రుల ఆస్థులు ఏవీ లేకపోయినా, తప్పుల నుంచి (వెంటనే) నేర్చుకునే బుద్దొక్కటి  మాత్రం ఇచ్చేసాడా భగవంతుడు. ఆ సోదంతా మళ్ళీ చెప్తా గానీ ఇంత కధ చెప్పిన సోమయాజి ఇవ్విధంబున చెప్పిన అబద్ధమేమిటా అని ఆలోచిస్తున్నారా?

ఉమ్.. కొంచెంసేపాగాలి మరి.

(Contd.. part-II)

కొద్ది సేపు తేనీటి విరామం తీసుకున్నందుకు కృతజ్ఞతలు. సరే! ఇక అసలు కధలోకి వెళ్లేముందు ఒక చిన్న పిట్ట కధ చెప్పుకుందాం.

సుమారు పదహారేళ్ళ క్రిందటి మాట.  అప్పటి నుంచి ఇప్పటి వరకూ జరుగుతున్న ఆట. అప్పట్లో ఒక వాచ్ షాప్ లో క్లీనర్ గా మొదలైంది నా కెరీర్. నిజం!  రోజుకి ఒక రూపాయి జీతం. పెద్ద పెద్ద గడియారాలు అన్నీ స్క్రూలు విప్పి కిరోసిన్ లో వెయ్యాలి. అంతే పని. అదే పని. రోజుకి ఒక గంట పార్ట్ టైం జాబ్ అన్న మాట. బేరం లేకపోతే పనికి రానవసరం లేదు.  తర్వాత ఒక వీడియో గేమ్ షాప్ లో పిల్లలకి సాయం చేసే హెల్పర్ గా, ఆ తర్వాత ఒక టెలిఫోన్ బూతులో  రాత్రి సహాయకుడిగా, మరోసారి కంప్యూటర్ ల్యాబ్ లో డేటా-ఎంట్రీ-ఆపరేటర్ గా, తదుపరి ఒక లాయర్ దగ్గర అసిస్టంట్ గా, ఆ తర్వాత రఘు జూనియర్ కాలేజి లో పేపర్లు దిద్దే వాడిగా, అదే కాలేజి విద్యార్ధి హాస్టల్ లో వార్డెన్ గా, గ్రీన్ పార్క్ హోటల్ లో ఫ్రంట్ ఆఫీసు క్యాషియర్ గా, సోనీ సర్వీసు సెంటర్ లో స్టోర్ కీపర్ గా, నికోలస్ పిరమాల్ లో ఫార్మా సేల్స్ ఆఫీసర్ గా, చివరకి ఒక గవర్నమెంటు గుమస్తాగా… ఇలా గత పదహారేళ్లలో ఇంకా చెప్పలేనన్ని ఉద్యోగాలు చేశాను. ఈ ఉద్యోగాల లిస్టు ఇంతవరకు ఎవ్వరికీ పూర్తిగా తెలీదు. ఇంకా కొన్ని నాకు కూడా వెంటనే గుర్తుకు రావటం లేదు.. ఒక్కోటీ ఒక్కో అనుభవం.. ఒక్కొక్క పాఠం.. ఇదేమీ చిరంజీవి సినిమా కాదు కానీ ఒక రూపాయి జీతం తో ప్రారంభ మైన నా వృత్తి  జీవితం ఎన్నో మలుపులు తిరిగి ఇప్పుడు రోజుకి వెయ్యి రూపాయలు పైగా సంపాదిస్తున్నాను. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, ఒకే ఒక విషయం నివృత్తి చెయ్యటం కోసం.  ఇవ్వాళ ఇక్కడ నించోవటం కోసం నేను ఒక్కొక్క మెట్టూ భారంగా ఎక్కి వచ్చాను.. ఒక్కొక్క ఇటుకా బరువుగా, ఓపికగా, పొందికగా పేర్చుకుని వచ్చాను…కాబట్టి నాకు చేసే పని పట్ల ఒక నిబద్ధత ఉంది. పనిచ్చిన వాడిమీద గౌరవం ఉంది.  భవిష్యత్తు మీద ఒక పాజిటివ్ నమ్మకం ఉంది. అచంచలమైన ఆత్మ విశ్వాసం ఉంది.. ఓటమి అంగీకరించని ఒక రకమైన పోరాడే తత్వం నరనరాన పేరుకుపోయి ఉంది.. (కొంచెం బుర్ర తిరుగుడు కూడా ఉందనుకోండి. కానీ ఈ మధ్య బాగా దార్లోకి వచ్చేసాను అది వేరే సంగతి.) ఇదంతా చెప్పింది పనిని నేను ఎంత గౌరవిస్తానో తెలియచెయ్యటానికే.

నాలోనూ లోపాలున్నై. నేనూ అనవసరమైన గొడవలు ఎన్నో పడ్డాను.. వాటన్నిటినీ ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ వచ్చాను. సరే ఇంక బాగోదు.. అసలు కధలోకి వచ్చేద్దాం..

(గోప్యత కోసం పేర్లు మార్చటం జరిగింది.)

పూర్వాశ్రమంలో కిరణ్మయి అని నా కొలీగ్ ఒకామె ఉండేది….. ”ఉండేది” అని ప్రత్యేకంగా చెప్పటానికి కూడా ఒక కారణం ఉంది.  చివర్లో చెప్పుకుందాం దాని గురించి. మేమందరం ముద్దుగా ‘కిర్రూ’ అని పిలిచే వాళ్ళం.  ౧) తను చాలా మంచిది. ౨) చాలా బాగా ఆలోచిస్తుంది. ౩) చాలా చాలా బాగా చదువుతుంది. మరింకేంటి? చివరి రెండు కారణాలు చాలు కదా సోమయాజి ఫిదా అయిపోవటానికి 😉  బహుశా అందుకేనేమో తనంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండేది.  నాకంటే కొంచెం చిన్న పిల్లే అయిన కొన్ని కొన్ని విషయాల్లో ఆరిందాలా తనిచ్చే సలహాలు నన్ను అబ్బుర పరిచేవి. దేన్నైనా చాలా బాగా విశ్లేషించేది. కష్టపడి పని చేస్తుంది. ఎవరికీ ఏ సాయం చెయ్యాలన్నా ముందు నించుంటుంది.  మనసు అయితే వెన్న ముద్ద అని చెప్పచ్చు. మరి అంత మంచి మనిషితో నీకు సమస్యలేంటి అని కనుబొమ్మలెగరెయ్యకండి. అక్కడికే వస్తున్నా..

ఇద్దరం ఒకే అధికారి కింద పనిచేసేవాళ్ళం.  వీలున్నంత వరకు ఒకరికొకరం సాయం చేసుకునేవాళ్ళం. కాకపోతే మా ఇద్దరివి రెండు ప్రత్యేకమైన, విభిన్నమైన పని తత్వాలు. ఎవరి తరహా వాళ్ళకుంటుంది కదా.  అందులో తప్పేముంది. తనకి పరిచయస్థులు చాలా ఎక్కువ.  ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా క్షణాల మీద తెలుసుకునేది. నా వృత్తం చాలా చిన్నది. తల వంచుకుని నా పని నేను చేస్కోటం తప్ప మిగతా విషయాలు సొక్కవు న్నాకు.  తను చాలా వేగంగా చేసేది ఏ పనైనా. ఒక రోజులో తను చెయ్యాల్సిన పనులు చాలా ఎక్కువనో ఏమో మరి. నిజంగా నాకు తెలీదు. ఆ వేగంలో చిన్న చిన్న బుడ్డి బుడ్డి పొరపాట్లు చేసేది. వెంటనే దిద్దేసుకునేది. నేనేమో ‘కుంగ్-ఫు పాండా’ సినిమా లో తాబేలులా ప్రతి పనీ నెమ్మదిగా, జాగ్రత్తగా చేసేవాణ్ణి. కాబట్టి పొరపాట్లు చాలా తక్కువ జరిగేవి (అసలు లేవని చెప్పచ్చు!!). చాలా మందికి నా నెమ్మదితనం, జాగ్రత్త నచ్చక, నేనేదో కావాలని ఆలస్యం చేస్తున్నట్టు ముఖం చిట్లించిన సందర్భాలు కూడా ఉన్నాయి లెండి.

సరే! రోజులు ఇలా నడుస్తుండగా ఈలోగా ఆ సంవత్సరాంతంలో పదోన్నతులు ఇచ్చే సమయం వచ్చింది. అప్పటికే కొన్ని సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నాం..ఇద్దరికీ వస్తుందని ఆశించాం. అన్నీ బాగుంటే వచ్చేదేమో కూడా. కానీ మీకు ఆ సామెత తెలుసుగా. ‘తానొకటి … పైవాడొకటి.. ‘ అని? ఒకరోజు ఉదయాన్నే బాంబు పేలింది .. ధామ్మని .. ఇద్దరికీ రాలేదు. తను చాలా అప్సెట్ అయింది. ఒక పది నిముషాలు కుళాయి కూడా ఇప్పిందని ఇతర ఉద్యోగులు చెప్పారు. అమ్మాయిలకది కామన్ అనుకోండి.. 😉 నాక్కూడా ఎక్కడో కదిలింది కానీ తమాయించుకున్నాను. ఇద్దరం ఒకరికొకళ్ళు సర్దిచెపుకున్నాం. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక వేస్కున్నాం. ముందుకి సాగిపోయాం.  కాకపోతే ఇక్కడే మెలిక తిరిగింది కధ.

మిగతాది టైపు చెయ్యటానికి మరొక విరామం కావాలి.. మరేమీ అనుకోకండి.. మళ్లీ కొనసాగిద్దాం.. 😉

(Contd.. part-III)

ఇంకా మరి ఆపటం, ఆలస్యం చెయ్యటం కుదరటంలేదండీ!  ఇదిగో చెప్పేస్తున్నాను.. వినండి.
సో ఇద్దరికీ పదోన్నతులైతే రాలేదు గాని పదో పరకో జీత భత్యాలు మాత్రం పెరిగాయి. ఎవరికి ఎంత పెరిగిందో చెప్పుకోవటం అప్పటికి మాకున్న కార్మిక చట్టాల ప్రకారం నిషిద్ధం.  కానీ స్నేహితుల మధ్య ఇలాంటి సమాచార ప్రవాహం ఎవరు ఆపగలరు? నేను కూడా చెప్పేద్దునేమో? కానీ ఇదంతా జరగటానికి కొద్ది రోజుల ముందు మాటల సందర్భంలో  తనిలా అంది.. చాలా యధాలాపంగా:

ఈసారి మనిద్దరికీ పదోన్నతి రావాలి బాలు!  జీతాలు కూడా బాగా పెరగాలి. నాకు కనీసం ‘X’ శాతం.. నీకూ కనీసం కనికిష్టం ‘Y’ శాతం పెరగాలి మరి.. చూద్దాం ఏం జరుగుతుందో?

నా గుండె గుభేలు మంది. ఊరికనే కాదు. అక్కడ తను చెప్పిన అంకెల్లో  Y కి ఒకటి కలిపితే X వస్తుంది.  ( X = Y + 1 )  అన్నమాట. ఏదో లీలగా అర్ధమయ్యీ కానట్టు అనిపించింది. అంటే నాకేదో తక్కువ జీతం వచ్చేస్తుందేమో అన్న బెంగ నాకు ఏ కోశానా లేదు. తల్లి తోడు. మన రూపాయి కధ చెప్పానుగా పైన. కాని తను అలా ఏవిధంగా లెక్క వేసింది? నాకంటే ఒక పిసరు ఎక్కువ పని చేస్తోంది కాబట్టి ఆ పిసరు ఎక్కువ జీతం పెరుగుతుందని అనుకుంటూ ఉందా?  ఈ ఎక్కువ తక్కువలు ఎలా బేరీజు వేసింది? అంటే నెమ్మదిగా పని చెయ్యటం నా లోపమా? వేగంగా పనిచెయ్యటం వలన పై అధికారులు ఎక్కువ సంతృప్తి చెందుతారా? అయ్యో రామా! ఏమిటీ సంకటం?….. ఇలా ఇన్ని రకాల ఆలోచనలు గుప్పున చుట్టుముట్టాయి. కానీ గుంభనగా ఊరుకున్నాన్నేను.  సరేలే! తను నాకన్నా వేగంగా చేస్తుంది. ఎక్కువ చేస్తుంది. ఎలా అయితే ఏముంది? ఇంక పైన చెప్పిన అంకెలంటారా? తన మనసులో ఏముందో? మనకెందుకొచ్చిన గొడవ? అని అక్కడితో వదిలేసా ఆ విషయం. … కట్ చేస్తే…

ఆ బాంబు పేలిన రోజు ఉదయం.  ఇద్దరికీ పదోన్నతులు రాలేదు. కేవలం జీతాలు పెరిగాయి, కానీ అక్కడే జరిగింది పితలాటకం… అంకెలు మాత్రం తారుమారయ్యాయి.  తనకి Y వచ్చింది.. నాకు X… 😦 😦 😦 విషయం అర్ధమౌతున్న కొద్దీ నాలో టెన్షన్ మొదలైంది. ఈ విషయం ఎలా చెప్పాలి? అసలే పదోన్నతి రాలేదని భాదపడుతూ ఉంది. ఇప్పుడు ఈ అంకెల తారుమారు ఎలా చెప్పాలిరా బాబూ? అని ఆలోచిస్తున్నాన్నేను. ఈలోగా సుడిగాలిలా వచ్చేసింది ఆ ప్రశ్న:
“బాలూ! ఎంతొచ్చింది నీకు?”…..
(దేముడా! ఏం చెప్పాలి ఇప్పుడు? చివరిసారిగా ఒకే ఒక్క క్షణం ఆలోచించాను)
“నీ కన్నా తక్కువే కిర్రూ!”  (ఇదే ఇదే ఇదే ఇదే ఇదే ఇదే ఇదే.. నేను చెప్పిన ఆ అబద్ధం)
“ఓహ్ ఎంత?”
“తక్కువే.  వదిలేయ్ ఆ విషయం ఇంక”

ఆ ఎదవ సచ్చిన అబద్ధం అక్కడితో ఆగలేదు. ఇతర స్నేహితులందరూ అడుగుతున్నారు ఎంత పెరిగింది జీతం అని.  ఎవరికైనా చెప్పి వాడు తిరిగి తనకి చెప్పేస్తే?  అందరికీ ఒకటే సమాధానం చెప్పాను. “కిర్రూ కి బాగా వచ్చింది. నాకు తక్కువే!” …. ఓహ్! అవునా! అనేసారు అందరూ. కానీ నాలో మాత్రం ఆ పిచ్చి గిల్టీ ఫీలింగ్… ఇక తట్టుకోలేక ఒక ఇద్దరు స్నేహితులకి మాత్రం చెప్పేసాను అసలు విషయం.  వాళ్ళసలు పట్టించుకోలేదు. ఓస్! అంతేనా అన్నట్టుగా చూసి వెళ్ళిపోయారు.. కానీ అక్కడితో ఆగితే అది కధ ఎందుకౌతుంది? అందులో పస ఏముంటుంది?

సరే రోజులు గడిచిపోతున్నాయి…అడిగినవారికల్లా నేను చెపుతూనే ఉన్నా ఆ అబద్ధం. .. వారాలు.. నెలలు…ఒక సంవత్సరం… మళ్ళీ బాంబు దినం రానే వచ్చింది. కానీ ఈసారి అది పండుగ దినం.  ఇద్దరికీ పదోన్నతి. ఏదో తెలియని ఉత్సాహం. ఆనందం… పై అధికారి ముందు తనని పిలిచాడు ఛాంబర్ లోకి… నవ్వుతూ బయటకు వచ్చింది మొహం చాటంత  చేసుకుని…… తర్వాత నేను… చేతిలో పదోన్నతి కాగితం పెట్టి అభినందించాడు… నేను వంగి చదువుతూ ఉండగా అతను బయటకు వెళ్లి తనని కూడా పిలుచుకొచ్చాడు, ఇద్దరికీ కలిపి ఏదో చెప్దామని. తను లోపలకొచ్చినట్టు నేను చూసుకోలేదు. గభాలున లోపలికొచ్చిన తనకి ఒకే ఒక్క క్షణం కనిపించింది  నా కాగితం … సెకనులో వందోవంతు సమయం… అది చాలనుకుంటాను… అక్కడ ఉన్న నా జీతం అంకె చూడటానికి.. వెంటనే X లు Y లు లెక్క వెయ్యటానికి (అసలే టూమచ్ తెలివైనది 😦 )… విషయం అర్ధమైపోటానికి…. అబద్ధం బట్ట బయలు కావటానికి..  నాకు ఇంకా తెలీదు తను చూసేసిందని. అధికారి ఏదో చెప్పాడు..ఇంక తను ఏం వినిపించుకునే పరిస్థితిలో లేదని అసలు ఏం వినలేదని తర్వాత అర్ధమైంది నాకు. .. ఛాంబర్ లోపలినుంచి బయటకు రాగానే నన్ను పిలిచింది వేరే గదిలోకి… అప్పటికే సాయంత్రం అయిపొయింది.. అందరూ వెళ్ళిపోతున్నారు. ఒకే ప్రశ్న సూటిగా అడిగింది “ఎందుకు అబద్ధం చెప్పావు?” .. నేనేదో సర్దిచెప్పటానికి ప్రయత్నించాను. దాటవేద్దామనుకున్నాను… కుదరలేదు.  “నువు చెప్పేది నిజమైతే ఆ కాగితం చూపించు. అదే రుజువు”.. హలా! లక్ష్మణా!..ఇంక తప్పలేదు.. ఒప్పేసుకున్నాను. అప్పుడు ప్రారంభమైంది అసలు ప్రవాహం… చాలా తిట్టింది. నన్ను, అందరిని కూడా.  సుమారు ఒక గంట పాటు ఏడ్చింది.  పదోన్నతి ఆనందం పది నిమిషాలు కూడా నిలవలేదు….నన్ను తనన్న మాటల్లో కొన్ని ఇక్కడ (మరికొన్ని రాయకూడదు., ఇంకొన్ని రాయలేను.):

౧. ఇప్పుడు చెప్తున్నాను! నాకు నీకన్నా ఎక్కువ రావాలి. ఏ రకంగా చూసినా.
౨. ఛీ! నువ్వొట్టి డబ్బు మనిషి. అందుకే డబ్బు గురించి అబద్ధం చెప్పావు.
౩.  అసలు నువ్వే నామీద ఏదో అవీ ఇవీ కల్పించి చెప్పి ఉంటావు.  ఇంకా ఏమేం చెప్పావో?  ఇంక నీకేమీ చెప్పకూడదు.
..
..
ఒక్కొక్కటీ ఒక్కొక్క తూటాలా తగిలింది నాకు.  అరటి పండుకి సూదులు గుచ్చినట్టుగా.. నిశ్సబ్దంగా.. ఎక్కడో ఏదో చీలిపోతున్నట్టుగా అనిపించింది. నాకు తిరిగి మాట్లాడటానికి అవకాశమే ఇవ్వలేదు… అంతే! అదే చివరిసారి మేమిద్దరం మాట్లాడుకోవటం… ఆ తర్వాత మా ఇద్దరి దారులు వేరయ్యాయి. మళ్ళీ కలుసుకోలేదు. ఎక్కడ ఉన్నా ఏమైనా తనకి ఈ సందేశం అందుతుందనే ఆశతో రాస్తున్న విన్నపం ఇది:

చూడు కిర్రూ! నేను డబ్బు మనిషిని కాదు.
నీకే ఎక్కువ రావాలేమో? కాని తక్కువ రావటంలో మాత్రం నా ప్రమేయం లేశమాత్రమూ లేదు.
నీ గురించి నేను కలలో కూడా మరో మనిషితో తప్పుగా మాట్లాడలేదు.
నేను నిజం చెప్పిన ఇద్దరు స్నేహితులు ఎప్పటికైనా నీకు నిజం చెప్తారు.
అసలు నాకు ఎక్కువే వచ్చిందనుకో.  నా స్నేహితురాలివై ఉండి, నన్ను అభినందించటం మాని నువ్వు గంటకు పైగా ఏడిస్తే నేను బాధపడనా?
ఈ నిజం ఆరోజే తెలుసుంటే, అప్పుడు ఇంకా వేడి మీద ఉన్నావు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ సేపు ఏడ్చి ఉందువా? ఆ లెక్ఖన నేను అబద్ధం చెప్పి ఈరోజు నిన్ను తక్కువ సేపు ఏదిపించాను కదా..

డబ్బు గురించి అబద్ధం చెప్పినవాడు డబ్బు మనిషి అయితే, మరి డబ్బు గురించి గంట సేపు ఏడ్చినవాడు ఏమౌతాడు ?

నువ్వు నాకు చెప్పిన అబద్ధాలని (వేరే ఉన్నాయ్ లెండి) నేను అబద్ధాలుగానే ఉండిపోనిచ్చాను. నవ్వి ఊరుకున్నాను. నిన్ను బాధ పెట్టటం ఇష్టం లేక.
ఇదంతా జరిగిన తర్వాత నువ్వు నా గురించి చెడుగా మాట్లాడిన ఛాయలు కూడా కనిపించాయి. అయినా నాకు కోపం రాలేదు.. ఏదో నీ చిన్నతనం. తెలుసుకుంటావు లే.
ఆ తర్వాత నువ్వు నా నుంచి దూరం చేసిన మనుషులు ఇప్పటికి కూడా తిరిగి నాతో మామ్మూలుగా లేరు.  పిచ్చి కొడుకులు. నువ్వు చెప్పిందే నమ్ముతారు (పూర్వం నాలాగే)… అలాగే కానీ! నేను ఏం చెయ్యగలను ఇప్పుడు?

చివరిగా ఒకే ఒక్క మాట:  కోపంలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు చెప్పినదంతా కూడా నీకు అబద్ధంలా అనిపించొచ్చు. లేదా నాకు తెలియని, నేను ఊహించలేని మరో కోణం ఉండి ఉండొచ్చు.  అలాంటప్పుడు మరింకేం చెయ్యలేను నేను..

True friends at times will have intense hatred of each other to actually qualify that trueness

ఎప్పటికైనా నువ్వు తిరిగి కలుస్తావని.. కనీసం ఇది చదివి నా వెర్షన్ తెలుసుకుంటావని,
గంపెడాశతో,
బాలు.

Advertisements
Categories: తెలుగు, emotions, psychology, world | 14 Comments

Post navigation

14 thoughts on “నిజం – అబద్ధం

 1. మొదటి తెలుగు టపాలోనే చింపేసావన్నా…ఒక జీవిత సత్యాన్ని చాలా బాగా చెప్పావు. నిజంగా, ఒక మంచి బంధాన్ని వదులుకోవాలి అంటే అది ఎలాంటి కారణమైనా కావచ్చు, ఎంత కష్టంగా ఉంటదో నాకు తెలుసు…

 2. Chandu

  చచ్చేవరకు చంపకు ఏ నిజాన్ని, ఆ నిజం నిన్ను చంపినా సరే,
  నీకు నోరుందని ఆడుతున్నావా అబద్దాన్ని, నోరులేని మూగజీవి అయిపో అబద్దాన్ని ఆడవలసిన మరుక్షణం,
  ఓడిపోతావని ఆడకు అబద్దాన్ని, గెలుపెప్పుడు సత్యానిదే ( నువ్వు జీవిన్చియున్నన్ /మరనిన్చినన్ )
  సత్యమేవ జయతే

 3. Chandu

  బాగా చెప్పావన్న .పెద్దోళ్ళు సామెతలు ఊరికే చెప్పలేదు. వాటిని మనం సులభంగా అర్ధం చేస్కోవటానికి వాడుక భాషలో చెప్పేవారు…వాటిని మనం విని అవతల పారేయకుండా కనీసం కొన్నింటినైన ఆచరించాలి. కానీ మన నోటికి బూతులు తప్ప మరేమీ రావు కదా.

 4. Jyotsna

  చాలా బాగా చెప్పారు…మీ గురించి మీరు అద్భుతంగా రాసారు(intro lo).

 5. tvbhascar

  బాసు గారు..మీ అభిప్రాయాల్ని అక్షరాల రూపమే కాదు …అభినయాల రూపం లో ఛూపితే ఇమ్కా బాగున్టున్ది …యూ ట్యూబు లో వీడియో లు పెడితే అదుర్సు…మచ్ఛుకి దీని మీద నొక్కన్డి http://www.youtube.com/watch?v=A3_xzQO1b0E..
  the video i uploaded is a comedy track..no match to your geetha sandesam

 6. akp

  wow bro!! you have the knack for a tight story telling, now I am really eager to know what a lie has got to do with the “no-promotion” story!!

  I initially thought it to be an article on someone who has put up a fake experience (all due to your intro- a fab one though!) but then again it is turning out to be really something else!!

  I envy your bi-lingual command or may be even I should try my hand (though the movie script I am writing is for a telugu movie) I guess I found my dialogue writer!!

 7. rajesh narni

  waiting for 3rd…

 8. Sailaja

  I hope she reads and be friends again..

 9. tvbhascar

  since she is female she has x chromosoms.hence she hoped a hike of x…similarly male y….

 10. Jyotsna

  Hats-off to your dedication and commitment….happy to know people like you….

 11. rajesh narni

  ok balu context mottam ardam ayindi. Hope everything will be back to normal. Your writing style is good.

 12. devi

  hmm…well balu i have two points to talk about…
  1. bcos of ur ” abadhdham ” i guess u came to know what kind of person your friend( can i say so…)is / was

  bcos if one cannot tolerate ur success / growth / achievement how can we still call him/her as a friend ???

  2. for such a silly reason two friends got separated…quite surprising…
  if its a true friendship…there should be no question of mental separation-atleast.
  even though you r geographically apart for your career / various other reasons, “moham chaateyyalsinantha” tappu nuvvu em chesaavo naaku teleedam ledu…

  but i wish you all the very best and may your friend read this and again may come back to u.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Blog at WordPress.com.

%d bloggers like this: