ఏ దారెటుపోతుందో ఎవరినీ అడుగక


Look into my eyes, and you will find my small universe.

Look into my eyes, and you will find my small universe.

చాలా చాలా సంవత్సరాలు నాకు అర్ధం కాలేదు….

“ఎవరికెవరు ఈ లోకంలో…” అనటం సబబు .. కానీ  “ఏ దారెటుపోతుందో ఎవరినీ అడుగక”.. అని చెప్పటంలో మర్మమేంటని ప్రతిసారీ నన్ను నేను ప్రశ్నించుకునేవాణ్ణి. అంత హృద్యంగా, నమ్మకంగా చెప్పాడాయె మరి. 

ఎలా వెళ్ళాలో తెలియనప్పుడు అడిగితే తప్పేముంది? ఆ కవి బహుశా ఏ అడవిలోనో ఆటవిక తెగల మధ్య ఉండేవాడేమో? దారి అడిగితే కొట్టేవారేమో? నలుగురితో కలిసి బతకటం, మెలిసి తిరగటం లాంటివి చెయ్యకూడని ‘నాగరికత’ లోంచి వచ్చాడేమో? ఇలా ఎన్నో ప్రశ్నలు కానీ దేనికీ నిశ్చయమైన సమాధానం దొరకలేదు.. తేరిపార చూస్తే ఆ ప్రశ్నలన్నీ తిరిగి నాకే గుచ్చుకున్నాయి..   అక్కడికి మనమేదో పెద్ద నవ ‘సమాజం’ లో ఉన్నట్టు, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనుషులన్నట్టు, మన ప్రపంచంలో ప్రతి దారికీ ఒక గమ్యం ఉన్నట్టు, ప్రతి మనిషికీ ఒక లక్ష్యం ఉన్నట్టు, ప్రతిదాన్లోనూ పరిపూర్ణత సాధ్యమన్నట్టు .. ఇలా ఏవేవో పిచ్చి అపోహలు నన్ను సరిగ్గా ఆలోచించనివ్వలేదు..  కానీ కాలం గడుస్తున్నకొద్దీ, చూస్తున్న చదువుతున్న వింటున్న విషయాలని ఆకళింపు చేసుకోవటంలో నాకూ ఒక క్లారిటీ వచ్చింది..   తగిలిన దెబ్బలు తగ్గకముందే కొత్త దెబ్బలు తగులుతూ ఉంటే తియ్యదనానికి నిర్వచనం తెలిసింది..  మీదనున్న మట్టి అంతా నీటి ఒరవడికి కొట్టుకుపోతే రాళ్ళు తేలిన దారిలా,  జీవితం మీద ఒక స్పష్థత వచ్చింది.. మనుషుల్ని చదువుతున్నకొద్దీ ఇంకా చదవాల్సింది ఎక్కువైపోతుందని తెలిసింది..  వందమంది చుట్టూ ఉన్నా ఒంటరితనం బాధించగలదని, విలువైనవన్నీ సరళంగా సామాన్యంగా ఉంటాయని, మంచికి విలువలేదని, శాస్త్రం మనుషులకోసమని, నిశ్శబ్దం ఓదారుస్తుందని, నైరాశ్యం సేదదీరుస్తుందని.. ఓహ్ ఇలా ఎన్నని చెప్పను? ప్రతి రోజూ ఒక సరికొత్త పాఠం. ప్రతి మనిషీ ఒక పసందైన పుస్తకం. ప్రతి అడుగూ, బంధం, సంఘర్షణా, సమావేశం .. ప్చ్! నేర్చుకోవటంలోనే శతాబ్దాలు దాటిపోయాయి.. తీరా చూస్తే నేనింకా అక్కడే ఉన్నాను.  నేర్చుకున్నదంతా ఎవరికైనా పనికొచ్చేలా చెయ్యాలన్న దుద్ద ఒకటి మిగిలింది కొత్తగా… రోజులు మాత్రం గడిచిపోతున్నాయ్ మెల్లగా శబ్దం లేకుండా..

కట్ చేస్తే, మన దైనందిన వ్యవహారాల్లో ఎంతోమందితో కూడి వెళతాం. సలహాలు అడుగుతాం. ఇస్తాం. 

బంధువులు, స్నేహితులు, సరదాలు, సినిమాలు, షికార్లు, పార్టీలు, చదువు, ఉద్యోగం, అలవాట్లు… ఇవన్నీ కొన్ని వందలమందిని మనకి పరిచయం చేస్తాయి.  గోదాట్లోకి వరద నీరోచ్చినప్పుడు  గొప్పగా  ముద్దొచ్చేసినట్టు, పరిచయాలు పెరుగుతున్నకొద్దీ ప్రపంచం మీద అబ్బురం పెరుగుతూ వస్తుంది.. అయితే,  అందులో చాలామందిది వచ్చే దారి, పోయే దారి.. కొద్దిమంది మాత్రం కాస్త దగ్గరగా వస్తారు..  చివరాఖరికి మహా అయితే ముగ్గురు నలుగురితో నువ్వు నీలా ఉండగలుగుతావు .. మిగతాదంతా నటన, మొహమాటం, రాజీ, యాదృచ్ఛికత ఇంకేదైనా కావచ్చు.. ఇక్కడే ఉంది విచిత్రం అంతా..

ఇప్పుడు మానవ నైజాన్ని వర్గీకరించటం నా ఉద్దేశం కాదు. కానీ ప్రతి మనిషీ ‘తన’ మెదడు చెప్పినట్టు చేస్తాడు.. తనకున్న విలువలతో, పరిజ్ఞానంతో, నైపుణ్యంతో నిర్ణయాలు తీసుకుంటాడు.. తన స్వభావాన్ని బట్టి మంచీ,చెడూ మాట్లాడటం, చెయ్యటం, బ్రతకటం..ఇలా తన చర్య, ప్రతిచర్యలన్నీ ఒక స్థిరమైన కానీ క్రమరహితమైన నివిష్టం(ఇన్పుట్) మీద ఆధారపడి ఉంటాయి. దీనికి తోడు ప్రతి ఆలోచన వెనుకా నీ వ్యసనాలు, భావోద్వేగాలు, అనుభవాలు, అభిరుచులు అనాలోచితంగానే దాక్కుంటాయి. ఇష్టమైనది కష్టంగా  అనిపించదు.. అదే  పని ఇష్టం లేకపోతే  చాలా చిరాగ్గా అనిపిస్తుంది. నచ్చిన మనిషి ఏం చేసినా పర్వాలేదు.. అదే  నచ్చకపొతే  చిలిపితనం కూడా కోపం తెప్పిస్తుంది…ఇవన్నీ కాకుండా నిన్నూ ఈ సంఘాన్నీ వేరుచేస్తూ నీ చుట్టూ నువ్వు గీసుకున్న వృత్తం, దానిచుట్టూ సంఘం గీసిన ఆవృత్తం..ఈ రెండూ కంటికి కనపడకుండా మొత్తం అన్ని విషయాలనీ శాసిస్తూ ఉంటాయి..

ఈ విధంగా ఇద్దరు మనుషుల మధ్య సమాచార బదిలీ ఇన్ని నిబంధనలకు, ప్రేరేపణలకు లోబడి ఉన్నప్పుడు, అసలు మంచి చెడులకు నిర్వచనాలు పూర్తిగా వ్యక్తిగతమైనప్పుడు, ఒక మనిషి అందరినీ సంతృప్తి పరచటం సాధ్యం కానప్పుడు, ఇక ఏదారెటు పోతుందో ఎవరినైనా ఎందుకు అడగటం? ఆ మహాకవి చెప్పింది ఊళ్లెళ్ళటానికి వేసిన దారులగురించి కాదని, ఊహలు పయనించే రహదారులగురించి అని అర్ధమైందని వేరే చెప్పాలా? ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన మనుషులు అందరూ కూడా ఏదో చేద్దామని బయలుదేరి ఏం చెయ్యాలో నిర్ణయించుకుని ఇక ఆ తర్వాత అది సాధించేవరకూ అలా నిలబడిపోయారు.. ఎత్తుపల్లాలెన్నొచ్చినా ఏం లెక్ఖ చెయ్యలేదు. అవునా?  సొంతంగా ఆలోచించే ప్రతిమనిషినీ ప్రపంచం మొట్టమొదటగా అపార్ధం చేసేసుకుంటుంది.  ఆ తర్వాత ముప్పుతిప్పలు పెట్టి ముచ్చెరువుల నీళ్ళు తాగించేస్తుంది. అప్పుడు నిరాశ పడిపోయావా? నువ్వెవరో ఆ ప్రపంచానికి ఎప్పటికీ తెలీదు. ఇదంతా చెప్తున్నది ఒకే ఒక్ఖ విషయం తేటతెల్లం చెయ్యటంకోసం.
 
నువ్వెవ్వరికీ అర్ధం కానప్పుడు, నీకెవ్వరూ అర్ధమవ్వనప్పుడు..  మెదడు, ప్రపంచం మొత్తం చీకటైపోయి ఏదుందో ఏది లేదో తెలియరాని నిర్వేదంలో నిలువునా మునిగి ఉన్నప్పుడు  సరిగ్గా గమనించు.. అలాంటప్పుడు మాత్రమే నీకు నువ్వు నిర్మలంగా కనిపిస్తావు..  నీ మాటలు నీకు స్పష్ఠంగా వినిపిస్తాయి.. మొత్తమంతా నిశ్శబ్దమైనప్పుదు నీ గుండె చప్పుడు నీకు వినిపించినట్టు నీ సొంత ఆలోచనలు నీకు దిశానిర్దేశం చేస్తాయి. నువ్వు సాధించాలనుకున్నది నీకు స్పష్టంగా కనిపించేంతవరకే నువ్వు సామాన్య మానవుడివి. ఆ తర్వాత అదే నిన్ను లాగుతుంది. అసామాన్యుణ్ణి చేస్తుంది…

పిడికిలి పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ కలలు కనే మనిషికి,  ఏ పని చేస్తున్నా అది పూర్తయ్యేవరకూ నిద్రపట్టని మనిషికి, జయాపజయాలతో సంబంధం లేకుండా స్వర్గం/నరకం ఏదైనా ఒక్కటేనన్నట్టుగా, కాళ్లతో కసిగా నేలను వెనక్కుతోస్తూ నడిచే మనిషికి,  విజయం మరొక  అడుగేకాని అదే గమ్యం కాదు..ఓటమి ఒక పాఠమే గాని అదే అంతం కాదు.. అందుకే ఏ దారెటుపోతుందో ఎవ్వరినీ అడగద్దు.. నీకు నచ్చింది చేసేయ్. అదే కరెక్టు.

/balu

Categories: తెలుగు, mind, philosophy, poetry, psychology, society, world | Tags: , | 2 Comments

Post navigation

2 thoughts on “ఏ దారెటుపోతుందో ఎవరినీ అడుగక

 1. Chinni Krishna

  Ammmmazing!!

  ” ప్రతి మనిషీ ‘తన’ మెదడు చెప్పినట్టు చేస్తాడు.. తనకున్న విలువలతో, పరిజ్ఞానంతో, నైపుణ్యంతో నిర్ణయాలు తీసుకుంటాడు.. తన స్వభావాన్ని బట్టి మంచీ,చెడూ మాట్లాడటం, చెయ్యటం, బ్రతకటం..ఇలా తన చర్య, ప్రతిచర్యలన్నీ ఒక స్థిరమైన కానీ క్రమరహితమైన నివిష్టం(ఇన్పుట్) మీద ఆధారపడి ఉంటాయి. దీనికి తోడు ప్రతి ఆలోచన వెనుకా నీ వ్యసనాలు, భావోద్వేగాలు, అనుభవాలు, అభిరుచులు అనాలోచితంగానే దాక్కుంటాయి. ఇష్టమైనది కష్టంగా అనిపించదు.. అదే పని ఇష్టం లేకపోతే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. నచ్చిన మనిషి ఏం చేసినా పర్వాలేదు.. అదే నచ్చకపొతే చిలిపితనం కూడా కోపం తెప్పిస్తుంది…ఇవన్నీ కాకుండా నిన్నూ ఈ సంఘాన్నీ వేరుచేస్తూ నీ చుట్టూ నువ్వు గీసుకున్న వృత్తం, దానిచుట్టూ సంఘం గీసిన ఆవృత్తం..ఈ రెండూ కంటికి కనపడకుండా మొత్తం అన్ని విషయాలనీ శాసిస్తూ ఉంటాయి..”

  తెలిసిన విషయమే ఐనా చాలా చక్కగా చెప్పారు. చాలా మందికి ఇంత organized గా తెలీదులెండి. సొంత OS లో bugs ని third party software తో patch చెయ్యాలని try చేస్తూ ఇంకా confuse అవుతుంటారు

  With your permission, may I publish these lines to my “అబ్బురమైన ప్రపంచం”? అదేనండీ facebook 🙂

  • haha np ckji.. grab whatever you want.. possibly with a little attribution 🙂 thank you so much for reading.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: